:::: తొలిపొద్దు ::::

నా రచన, కవిత , జీవితం
Subscribe

నా గురించి..

నేను నా భార్య

పరిచయ పుష్పాలు స్వీకరించండి.

నా పేరు : కె.దేవేంద్ర రావు

వయసు : ౫౨ (52) సంవత్సరాలు

అందరు దేవేంద్ర అంటారు. అదే నా కలం పేరు కూడా. పుట్టింది ౨౫-౦౮-౧౯౫౬ (25-08-1956). అమ్మ నాగరత్నం, నాన్న కొత్తూరు సూర్యనారాయణ. రైతు వారి కుటుంబం . పొట్ట చేత పట్టుకోని కృష్ణా జిల్లా దాకరం నుండి మా నాన్న తాత రామయ్య ౧౯౪౦ (1940) ప్రాంతాల్లో విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. పుట్టింది, పెరిగింది, తిరిగింది, చదివింది , ఆడింది , పాడింది అన్ని విజయవాడ లోనే . సాధారణ చదువే అందులో ఐ.టీ.ఐ కూడా ఉంది.

మా ఇల్లు నాకు తెలివి వచ్హినప్పటి నుండి వామపక్ష రాజకీయాల కేంద్రం గానే ఉంది. మా కుటుంబానికి ప్రజాశక్తి పత్రిక కు విడదీయలేని అనుభంధం. మా నాన్న అందులో పని చేస్తూనే చనిపొయ్యారు . నాకు , నా కొడుకు తో సహ మా అక్షరాలు భావాలు గా పురుడు పోసుకుంది అందులోనే . కవితలు, వ్యాసాలు , పాటలు  ఆ పత్రిక ద్వారానే తెలుగు నేల నాలుగు చెరగుల వ్యాప్తి నొందాయి. ” తొలిపొద్దు ” పేరిట షుమారు నాలుగు సంవత్సరాలు కవితా వ్యాక్యానాలు ప్రతి రోజు రన్నింగ్ కామెంట్రీ శైలి లో వెలుగు లు చిమ్మాయి .

నా పద్నాలుగవ యేట తొలిపాట రాసినట్టు గుర్తు. అప్పటి నుండి ముప్పయి ఎనిమిది సంవత్సరాల గా పాట తో నా మొదటి కాపురం అలకలు పులకల మధ్య కొనసాగుతోంది. నన్ను భరించటానికి ఐచ్చికంగా నా జీవితం లోకి వచ్హిన ఝాన్సీ నా ప్రధాన పోషకురాలు ప్రోత్సాహకురాలు . మాకు ఒక్కడే కొడుకు . వాడి పేరు ప్రత్యూష్ . ఎమ్.ఎస్ చేస్తున్నాడు. ఆమెకు నేనిచ్హిన నగలు నట్రా జ్నాపకాలు అనుభవాలు అనుభూతులు మాత్రమే, పాపం ఏ రోజు ఆమె నా కడుపు వంక తప్ప నా జేబు వంక చూడలేదు. మరి నాలాంటి కలల మనిషి తో జత కట్టుకున్నందుకు ఆమె కు ఆమాత్రం శిక్ష అనివార్యమే. ఆమె వృత్తి ఉపాధ్యాయిని . ప్రవౄత్తి ప్రజా ఉధ్యమాలతో సాన్నిహిత్యం, శ్రామిక మహిళ ల పోరాటాల్లో తాను పాల్గొనటమే కాదు , అందుకు న్ల్గురిని పోగేసే భాధ్యత ఆమెకు చాలా ఇష్టం . నాకు కుటుంబం నుంచి కొంచెం వివేకం , గురువులు పెద్దలు సహచరుల నుండి ఆవివేకానికి కొసరుగా కొంచెం సంస్కారం , దారిద్ర్యం హక్కుగా వచ్హినప్పటికి , సంతోషం భాధల ఎండ దెబ్బ కు తట్టుకుంటూ వాడని పచ్చని తోరణం లా మా గడపని అలంకరించే ఉంది.

ప్రజానాట్యమండలి తో దశాబ్దాల అనుభందం ఆదిలో అంటు కట్టుకున్న విధ్యార్ధి ఉధ్యమం , ఆతరువాత కొమ్మలు తొడిగిన ప్రజా సైన్సు ,అక్షరాస్యతా , మహిళా ఉధ్యమాలు వాటికి పూసిన పువ్వులుగా బాల కార్మిక వ్యతిరేక పోరాటం, బాలికా వికాస ఉధ్యమాలతో వీటన్నింటికి తల్లి వేరుగా పీడిత ప్రజల పోరాటం తో నిత్యనూతన సహజీవన వృక్షమే నా జీవన పక్షం.

అణుచుకోలేని ఉధ్వేగ క్షణాలే నా పాటలు , తదితరాలు. నేను వృత్తిగా రచయితను కాను. ఎంత రాసామో అన్నది కాకుండా రాసిన దాంట్లో ఎంత తృప్తి లభించింది అన్నది మాత్రమే నా అక్షరభద్ద భావాలకు పడికట్టురాళ్ళు.  వాటికి ఏనాడు జతపడలేదు నాలుగు పైకం రాళ్ళు.

పేజీలు : 1 2 3