నా గురించి..
నా ప్రధాన సాహిత్య ప్రక్రియ పాట. పాటల పల్లకీలో ఊరిస్తు ఊరేగే ఊహలకు పదచిత్రాల దుస్తులు ముస్తాబు చేసి సరిగమలనే బోయీలుగా మార్చి కూర్చి అవి లయ బద్దంగా వేసే అడుగుల కింద అయ్యే తీయని గాయాల బాటను నేను. అందుకే ఎక్కడ మంచి పల్లవి వినిపించినా ” అమ్మ పాలకు గుక్క పట్టే నెల బిడ్డడి గా అల్లాడపోతుంది నా మనస్సు ” . రాయటం లో ఆత్మానందం తో పాటు ఒక సామాజిక భాద్యత కూడా వున్నట్టే , పాట ను ” కని – పెంచటానికి ” అనేక మంది కవులకు మంత్రసాని గా ఉన్నందుకు ఎంతో తృప్తిని అనుభవించాను.
ఉద్యమ అవసరాలకు అనివార్యమై వీధి నాటికలు వ్రాసినా, వేసినా ప్రతి రహదారి కూడలిలో నటరాజు విన్యాసాల్లో నేను ఒక మువ్వగా మురిసి పోవటం నాకున్న పెద్ద బలహీనత. వీధుల్లో నే వేసిన అడుగులకు వచ్హిన చప్పట్లే నన్ను ఒక నృత్య దర్శకుడిగా పని చెయ్యటానికి ఉసి గొల్పాయి. ఆ రంది లో అనేక మంది ఆల బాలికలని ఎంత అలసటకు గురిచేసానో , తలచుకుంటే నా మీదే నాకు కోపం వస్తుంది. అందుకు ప్రాయచ్హిత్తం గా అనేక రాష్ట్రాల్లో వారి ప్రదర్శనల్లో లభించిన ప్రశంశల సంధర్భం గా క్షమాపణలు వినమృంగా చేప్పను.ఆనాటి నా ప్రయొగాలను ” సంగీత శిల్పాలుగా ” విమర్శకులు ప్రస్తావిస్థే నోరు వెల్లబెట్టటం తప్ప ఏవిధమైన ప్రతిస్పందన ఇవ్వలేని వాణ్ణీ.
నేను వ్రాసిన ” మాష్టారికి దండం పెడతా ” పాట డిపెప్ ( డి . పి . ఇ . పి ) శిక్షణ లో ఒక విడదీయలేని అంతర్బాగం . ” చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్హినా ” గీతం అనేక పాఠశాలల్లొ ప్రార్ధనా గీతం. ౧౯౯౦ (1990) దశకం అక్షరాస్యతా ఉధ్యమం లో రాష్ట్రమంతా ఏ కార్యక్రమంలో అయినా ప్రారంభ గీతం గా లక్షలాది మందిని అలరించింది.
ప్రభుత్వం వారు ప్రచురించిన మూడవ తరగతి తెలుగు భారతి వాచకం లో మొదటి పాఠ్యాంశంగా నా బాల సాహిత్యంలో ని గీతం ” పిడుగులం మేం బుడుగులం ” లక్షలాది మంది పిల్లల నోట సత్కరింపబడింది.
౨౦౦౩ (2003) వ సంవత్సరంకు గాను ” పాలగిన్నెలో జాబిల్లి ” టెలీఫిల్మ్ కోసం ” నా భారత దేశమ్ లో భవిత పేరు బాల్యం రా ” గీతం ఉత్తమ గేయ రచయిత గా నాకు నంది అవార్డు అర్హత సాదించి పెట్టింది.

జీవితంపై కలం చేసిన సంతంకం పాట
మనషుల మధ్య దూరాలు తగ్గించేదే మాట
అడ్డంకులను చూసి బయపెట్టనిదే బాట
పై
త్రివేణీ సంగమంలో మునకలేయటమే
నా మాట పాట బాట
-- దేవేంద్ర