నా గురించి

పరిచయ పుష్పాలు స్వీకరించండి.
నా పేరు : కె.దేవేంద్ర రావు
వయసు : ౫౭ (57) సంవత్సరాలు
అందరు దేవేంద్ర అంటారు. అదే నా కలం పేరు కూడా. పుట్టింది ౨౫-౦౮-౧౯౫౬ (25-08-1956). అమ్మ నాగరత్నం, నాన్న కొత్తూరు సూర్యనారాయణ. రైతు వారి కుటుంబం . పొట్ట చేత పట్టుకోని కృష్ణా జిల్లా దాకరం నుండి మా నాన్న తాత రామయ్య ౧౯౪౦ (1940) ప్రాంతాల్లో విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. పుట్టింది, పెరిగింది, తిరిగింది, చదివింది , ఆడింది , పాడింది అన్ని విజయవాడ లోనే . సాధారణ చదువే అందులో ఐ.టీ.ఐ కూడా ఉంది.


మా ఇల్లు నాకు తెలివి వచ్హినప్పటి నుండి వామపక్ష రాజకీయాల కేంద్రం గానే ఉంది. మా కుటుంబానికి ప్రజాశక్తి పత్రిక కు విడదీయలేని అనుభంధం. మా నాన్న అందులో పని చేస్తూనే చనిపొయ్యారు . నాకు , నా కొడుకు తో సహ మా అక్షరాలు భావాలు గా పురుడు పోసుకుంది అందులోనే . కవితలు, వ్యాసాలు , పాటలు  ఆ పత్రిక ద్వారానే తెలుగు నేల నాలుగు చెరగుల వ్యాప్తి నొందాయి. ” తొలిపొద్దు ” పేరిట షుమారు నాలుగు సంవత్సరాలు కవితా వ్యాక్యానాలు ప్రతి రోజు రన్నింగ్ కామెంట్రీ శైలి లో వెలుగు లు చిమ్మాయి .


నా పద్నాలుగవ యేట తొలిపాట రాసినట్టు గుర్తు. అప్పటి నుండి ముప్పయి ఎనిమిది సంవత్సరాల గా పాట తో నా మొదటి కాపురం అలకలు పులకల మధ్య కొనసాగుతోంది. నన్ను భరించటానికి ఐచ్చికంగా నా జీవితం లోకి వచ్హిన ఝాన్సీ నా ప్రధాన పోషకురాలు ప్రోత్సాహకురాలు . మాకు ఒక్కడే కొడుకు . వాడి పేరు ప్రత్యూష్ . పిహెచ్ డి  చేస్తున్నాడు. ఆమెకు నేనిచ్హిన నగలు నట్రా జ్నాపకాలు అనుభవాలు అనుభూతులు మాత్రమే, పాపం ఏ రోజు ఆమె నా కడుపు వంక తప్ప నా జేబు వంక చూడలేదు. మరి నాలాంటి కలల మనిషి తో జత కట్టుకున్నందుకు ఆమె కు ఆమాత్రం శిక్ష అనివార్యమే. ఆమె వృత్తి ఉపాధ్యాయిని . ప్రవౄత్తి ప్రజా ఉధ్యమాలతో సాన్నిహిత్యం, శ్రామిక మహిళ ల పోరాటాల్లో తాను పాల్గొనటమే కాదు , అందుకు నలుగురిని  పోగేసే భాధ్యత ఆమెకు చాలా ఇష్టం . నాకు కుటుంబం నుంచి కొంచెం వివేకం , గురువులు పెద్దలు సహచరుల నుండి ఆ వివేకానికి కొసరుగా కొంచెం సంస్కారం , దారిద్ర్యం హక్కుగా వచ్హినప్పటికి , సంతోషం భాధల ఎండ దెబ్బ కు తట్టుకుంటూ వాడని పచ్చని తోరణం లా మా గడపని అలంకరించే ఉంది.


ప్రజానాట్యమండలి తో దశాబ్దాల అనుభందం ఆదిలో అంటు కట్టుకున్న విధ్యార్ధి ఉధ్యమం , ఆతరువాత కొమ్మలు తొడిగిన ప్రజా సైన్సు ,అక్షరాస్యతా , మహిళా ఉధ్యమాలు వాటికి పూసిన పువ్వులుగా బాల కార్మిక వ్యతిరేక పోరాటం, బాలికా వికాస ఉధ్యమాలతో వీటన్నింటికి తల్లి వేరుగా పీడిత ప్రజల పోరాటం తో నిత్యనూతన సహజీవన వృక్షమే నా జీవన పక్షం.


అణుచుకోలేని ఉధ్వేగ క్షణాలే నా పాటలు , తదితరాలు. నేను వృత్తిగా రచయితను కాను. ఎంత రాసామో అన్నది కాకుండా రాసిన దాంట్లో ఎంత తృప్తి లభించింది అన్నది మాత్రమే నా అక్షరభద్ద భావాలకు పడికట్టురాళ్ళు.  వాటికి ఏనాడు జతపడలేదు నాలుగు పైకం రాళ్ళు.


నా ప్రధాన సాహిత్య ప్రక్రియ పాట. పాటల పల్లకీలో ఊరిస్తు ఊరేగే ఊహలకు పదచిత్రాల దుస్తులు ముస్తాబు చేసి సరిగమలనే బోయీలుగా మార్చి కూర్చి అవి లయ బద్దంగా వేసే అడుగుల కింద అయ్యే తీయని గాయాల బాటను నేను. అందుకే ఎక్కడ మంచి పల్లవి వినిపించినా ” అమ్మ పాలకు గుక్క పట్టే నెల బిడ్డడి గా అల్లాడపోతుంది నా మనస్సు ” . రాయటం లో ఆత్మానందం తో పాటు ఒక సామాజిక భాద్యత కూడా వున్నట్టే , పాట ను ” కని – పెంచటానికి ” అనేక మంది కవులకు మంత్రసాని గా ఉన్నందుకు ఎంతో తృప్తిని అనుభవించాను.


ఉద్యమ అవసరాలకు అనివార్యమై వీధి నాటికలు వ్రాసినా, వేసినా ప్రతి రహదారి కూడలిలో నటరాజు విన్యాసాల్లో నేను ఒక మువ్వగా మురిసి పోవటం నాకున్న పెద్ద బలహీనత. వీధుల్లో నే వేసిన అడుగులకు వచ్హిన చప్పట్లే నన్ను ఒక నృత్య దర్శకుడిగా పని చెయ్యటానికి ఉసి గొల్పాయి.  ఆ రంది లో అనేక మంది బాల బాలికలని ఎంత అలసటకు గురిచేసానో , తలచుకుంటే నా మీదే నాకు కోపం వస్తుంది. అందుకు ప్రాయచ్హిత్తం గా అనేక రాష్ట్రాల్లో వారి ప్రదర్శనల్లో లభించిన ప్రశంశల సంధర్భం గా క్షమాపణలు వినమృంగా చేప్పను.ఆనాటి నా ప్రయొగాలను ” సంగీత శిల్పాలుగా ” విమర్శకులు ప్రస్తావిస్థే నోరు వెల్లబెట్టటం తప్ప ఏవిధమైన ప్రతిస్పందన ఇవ్వలేని వాణ్ణీ.


నేను వ్రాసిన ” మాష్టారికి దండం పెడతా ” పాట డిపెప్ ( డి . పి . ఇ . పి ) శిక్షణ లో ఒక విడదీయలేని అంతర్బాగం . ” చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్హినా ” గీతం అనేక పాఠశాలల్లొ ప్రార్ధనా గీతం. ౧౯౯౦ (1990) దశకం అక్షరాస్యతా ఉధ్యమం లో రాష్ట్రమంతా ఏ కార్యక్రమంలో అయినా ప్రారంభ గీతం గా లక్షలాది మందిని అలరించింది.


ప్రభుత్వం వారు ప్రచురించిన మూడవ తరగతి తెలుగు భారతి వాచకం లో మొదటి పాఠ్యాంశంగా నా బాల సాహిత్యంలో ని గీతం ” పిడుగులం మేం బుడుగులం ” లక్షలాది మంది పిల్లల నోట సత్కరింపబడింది.


౨౦౦౩ (2003) వ సంవత్సరంకు గాను ” పాలగిన్నెలో జాబిల్లి ” టెలీఫిల్మ్ కోసం ” నా భారత దేశమ్ లో భవిత పేరు బాల్యం రా ” గీతం ఉత్తమ గేయ రచయిత గా నాకు నంది అవార్డు అర్హత సాదించి పెట్టింది.


నా వీధి నాటిక ” రైతు ” సగటు రైతు ఆత్మ ఘోష గా ౨౦ (20) సంవత్సరాలుగా నన్ను గన్న తల్లి ప్రజానాట్యమండలి నిర్వహిస్తున్న సఫ్ధర్ హష్మి ఓపెన్ ధియేటర్ ( షాట్ ) వీధినాటకోత్సవాలలో ఒక విడదీయలేని భాగం.దాని లోంచి ఒక్క మాటను తీయలేదు , అదనంగా రాయలేదు.  గత పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాపితంగా దిగజారిపోతున్న రైతుకు నిలువెత్తు సంతకం గా ఆ నాటిక ప్రదర్శింప బడుతుంది. మరో వీధి నాటిక ” గొర్రెలు తిరగ బడతాయి ” వేల ప్రదర్శనల కు నోచుకుంది. నా వీధినాటికలు కొన్ని ఇద్దరు ప్రముఖుల పీ.హెచ్.డీ లలో చర్చకు , విశ్లేషణ కు ప్రేరణ అయ్యాయి.నా లలిత గీతాలు అనేకం పలు వేదికల పై ఔత్సాహిక గాయకుల ఆర్తిని తీర్చి నాకు కూడా కొంత కీర్తిని సంపాదించి పెట్టాయి.

పాఠకులు మన్నించాలి . నా ఈ గోల ఈ సైటు తయారు చేసిన నా కొడుకు ” అలక ” తీర్చటాని కే .
నా అక్షరాలు మొత్తం నెట్లో పెట్టాలని వాడి ఆత్రుత. అప్పటికి వాడితో చెప్పాను , ఇంత వరకు ఒక చోటికి నా సాహిత్యం పోగు చెయ్యలేదు రా అని. వాడన్నాడు , ” రాయటం వరకే నీ పని , రాశాక అది పాఠకులకు అందుబాటులో ఉంచి తీరాలి . అందు కే పోగయ్యింది పోగయినట్టు పెడదాం “అని బలవంతం చేసి ఇది వ్రాయించాడు.


మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టి వుంటే మన్నించండి.
ప్రపంచంలో మనిషి చాలా జయించాడు. కాని భద్దకాన్ని జయించలేదు . ఆ జభ్భు నాకు కూడా వుంది.అయినా శ్రాయశక్తులా నా సాహిత్యం నెట్ లోకి ప్రవహించటానికి నా హ్రుదయపు లాకుల్ని ఎత్తి పట్టుకుని ఉండటానికి ప్రయత్నిస్తాను.
 

Published on  July 8th, 2013