గబ్బిలం తపస్సు

మనుషుల మధ్య దగ్గర తనం
దూరం రెక్కలు విప్పుకుని
ఉద్దర దొరికిన గద్ద లాగ
ఎగిరిపోతోంది .
ఎంత ఎత్తున తానున్నా
కోడి పిల్లను చూసినట్టు
కనపడని లోతుల్లోని మనిషితనాన్ని
తన్నుకుపోటానికి వేగంగా దూసుకొస్తుంది.
అవకాశ వాద పరకాయ ప్రవేశం
ఏ లాభమైన
లోభమైన అంతిమంగా పొట్టకోసం తిప్పలేనా ?
అదే నిజమైతే
ఆకలి తీరాకైనా
సహజీవనం సాధ్యం కావాలి .
అంతరాల ఆంతర్యాలు
” అంతర్యామి “
కరుణాకటాక్షణాలను
వెతుక్కుంటూ
మాడ వీధుల్లో ఎంతబాగా ఊరేగుతున్నాయి .
వంచన శిల్పాలు చెక్కుకుంటూ
ఆత్మవంచన పంచలో
కంచలే
స్వేదాల పంటలను స్వాహా చేస్తున్నాయి
సంగీతం
అభిసారిక
దీర్ఘనిరీక్షణా చూపులా గా
సమ్మొహనా తూపుల్ని సంధిస్తోంది,
మనసును మరోవైపు మరలకుండా భందిస్తూ.
పట్టపగలుగా
వెలుగుల వాన కురుస్తున్నా ప్రాణం చుట్టూ అలుముకున్న చీకటి .
ఎద రోట్లో
ఒకటే రోకటి పోటు
ఇంకెక్కడ ఉంది విశ్రాంతికి చోటు.
పాపం శమించు గాక!
దేవుని సన్నిది లో ఏమిటి అప్రాచ్యపు ఉపాఖ్యానాలు
ఇది లీల ?
కాదు కాదు
గర్భగుడిలో తపస్సు చేస్తు
గబ్బిలం ఊళ .
————————-
౧౨/౦౧/౨౦౦౯(12/01/2009)
తిరుమల కొండ పై విపరీతమైన చలిలో (చిరువేడిని వెతుక్కుంటూ)

Published on  July 7th, 2013