లెక్కొపాఖ్యానం

లెక్కలు మనిషికి
మంచి చెసాయా, చెడ్డ చేసాయా !
ఒక లెక్కలో
లెక్కలు లేని రోజుల్లో
దు:ఖాలు లేవని నా భావన
ఒక వేళ వున్నా
నొప్పికో చావు కో తప్ప
ఇప్పటి లా లెక్కకు మించి
ఇన్ని సార్లు ఎప్పుడూ
దు:ఖించి వుండడు.
అన్ని అనుభవాలు
అన్ని అనుభంధాలు
లెక్కలు చూసుకుని గాని
ఈ బొంది
బొందకో…
మంటల విందు కో పోదు..
లెక్క లోనే భగవధ్గీత ముక్కల్ని
కర్మ కు పర్యాయపదం గా లెక్కేసుకుంటున్నాం
దేశంలో అవినీతి చుక్కల్ని లెక్కించటానికి
“హబుల్ టెలిస్కోప్” చాలదని నిర్ధారణకొచ్చాం
“మన్”"మోహనం” రెండూ లేని
దండనాదుని కైదండ అండ తో
దండిగా పోగేసినొళ్ళ లెక్క
ఓ పక్క తేల్చలేక
కాలం లెక్కొదిలేసి
పక్క ఎక్కేసింది.
పి.యె.పి లెక్క సరిపోద్దని కొందరు
జె పి సి అయితేనే లెక్క సరి అవుద్దని కొందరు
చేసిన లొల్లి కి
శీతాకాలం పార్లమెంటునొదిలేసి
తమ్ముడు వర్షాకాలాన్ని కూడా వెంటేసుకొని
తెలుగు నేల పై తిష్టేసింది.
బలవంతపు చావుల లెక్క పెంచేసింది.
పిల్లకాయలపై కేసుల లెక్క
అసెంబ్లీ లో తేలలేదు.
ఒకే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య
మ్యాచ్ ఫిక్సింగ్ లో సెటిల్ అయ్యింది.
ఎనిమిది రోజుల నిరాహార దీక్ష లెక్క
దేశమంత బారైన సంతకం అయ్యింది.
బ్రిజేష్ కుమార్ రెండువేల యాభై వరకు వేసిన లెక్క
క్రిష్ణ్నమ్మ ను మహారాష్ట్ర కర్నాటక లకు “లక్” ఎక్కించింది.
మన వ్యవసాయానికి కన్నీటి చుక్కలు చాలని
ప్రాజెక్ట్ లను ఉట్టి ఎక్కించింది.
అర్ధంతరమా !
మధ్యంతరమా !
లెక్క తేలక “అక్కడా” “ఇక్కడా”
ఒక్కటే లెక్కల మీద లెక్కలు
చుక్కల వైపే రెక్కలు
సిగ్గుతో నవ రంధ్రాలు మూసుకున్న దిక్కులు
పై నుంచి క్రింద దాక ప్రాపకాల కోసం మొక్కులు
ఎమైతే నేం?
రాష్త్రం చేరుకుంది కబేళా
ఎప్పుడు సామాన్యునిదే దివాళా
రెండువేల పది, రెండువేల పదకొండు ఎంటి తేడా?
సర్ధాలంటాడు ఒకడు పెట్టీ బేడా
విడిపోతే పడుతుందంటాడొకడు జాతి కి పీడ
అక్కడా ఇక్కడా లెక్కల మీద లెక్కలు వెస్తూ
కుర్చీల కోసం ఎక్కడికకడ పక్కలేస్తూ
జనాలనొదిలేసినోళ్ళ లెక్క,
తేల్చేందుకు సొక్కా ?
పొయిట్రీ వ్రాద్దామంటే
లెక్క తప్పి ప్రోజ్ అయ్యింది
నూత్నవత్సరానికి
సామాన్యుని ఎజెండా
ప్రపోజ్ అయ్యింది.
————@—————-
గమనిక:
పి.యె.పి = పార్లమెంటరీ ఎకౌంట్స్ కమిటీ
జే పీ సీ = జాయింట్ పార్లమెంటరీ కమిటీ
   

 

Published on  July 6th, 2013