ఏంటీ! విచిత్రం !!

కాలాల గాలాలకు
చేనుల చెరువుల్లో
రైతుల శెవాలు దొరుకుతున్నాయ్
చిత్రం
ఆ శవాలకు గుండే తప్ప నోరు లేదు
పోస్టుమార్టంలో తేలింది ఏమి టంటే
గుండె నిండా గాయాల పరంపర
కళ్ళలో నల్ల రేగడి మెరమెర
దు:ఖాన్ని అణుచుకున్న గొంతు వుబ్బి
చిట్లిపోయిన గుర్తులు
కాదు కాదు
నీరుకాయ పై పంచ – చెట్టు కొమ్మ
ఉమ్మడి గా చేసిన నేరానికి
బలమైన సాక్షం అంటున్నారుకొందరు
శరీర రుగ్మత కారకాల్ని
హరాయించుకునే కాలేయం స్థానంలో
గవర్నమెంట్ ప్యాకేజీ ఉత్తర్వు
లుంగచుట్టుకుని ఎందుకు వుందో అర్ధంకావట్లేదని
డాక్టర్లు నొసలు చిట్లించారు.
జీర్నాశయంలో ప్రాణం తీసే సిద్ధాన్నం
ఏమాత్రం అరక్కుండా
ఘాటైన
“మసాలా వాసనలు”
చిమ్ముతుంటే
మరెన్నో బక్క జీవాలు
ఆబగా, ఆశక్తిగా
వాటి గురించి ఆరా తీస్తున్నారు
కాష్టాన్ని కాల్చటానికి
కట్టెలు సిద్దంగా లేవు
బొందలు తవ్వటానికి
పలుగులు సహకరించటంలేవు
దహనాల కన్నా, తవ్వాల్సిన బొందల కన్నా
కట్టైనా , పలుగైనా
ముందు రైతుల చేతులో వెలగాలట !
తండోపతండాల ఉప్పెనై వురకాలట
కసాయి సర్కారు కుతిక కసక్కున కొరకాలట
ఆ పిదపే రైతుల దహనాలట!!!

Published on  July 6th, 2013